Sunday 25 November 2012

విశ్వకర్మ

ప్రభాసుడనే మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు విశ్వకర్మ. దేవతల నగరాలు, ఆయుధాల, రథాలు విశ్వకర్మ తయారు చేస్తాడు. ఇతని కుమార్తె సంజ్ఞ. ఈమె సూర్యుని భార్య. సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోలేకపోవడంతో విశ్వకర్మ సూర్యుడికి సానబెట్టి, అతని వేడిని కొద్దిగా తగ్గిస్తాడు. సూర్యుడిని సానబెట్టిన పొడి నుంచి తయారు చేసిందే విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రం. శ్రీ కృష్ణుడికి ద్వారకను నిర్మించిందీ, పాండవులకు మయసభ నిర్మించిందీ విశ్వకర్మే. పురాణాలలో ఇతని పేరు ఇంకా అనేక చోట్ల కనిపిస్తుంది. ఘ్రుతాచి అనే వనితను చూసి మోహించిన విశ్వకర్మ, మానవుడిగా జన్మించి ఆమెను వివాహమాడడతడు. వారికి జన్మించిన వారే అనేక వృత్తులలో నిపుణులుగా స్థిరపడ్డారని పురాణాలు చెబుతాయి.

కౌరవుల పేర్లు

దుర్యోధనుడు, దుశ్శాసనుడు దుర్దర్షుడు, జలసంధుడు, సహుడు, సముడు, విందుడు, అనువిందుడు, దుర్భాషుడు సుబాహుడు, దుష్ట్రధర్షణుడు, ధర్మధుడు, చిత్రయోధి, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతి, జయసంధి, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారువిత్రూడు, శతాననుడు, ధర్మర్షణుడు, దుర్ధర్షణుడు, వివిర్సుడు, కటుడు, శముడు, ఊర్ణనాధుడు, సునాధుడు, నందకుడు, ఉపనందకుడు, సేనాపతి, సుషేణుడు, కుండో, మహోదరుడు, చిత్రధ్వజుడు, చిత్రరధుడు, చిత్రభానుడు, అమిత్రజిత్, సువర్ముడు, దుర్వియోచనుడు, చిత్రసేనుడు, విక్రాంతకుడు, సుచిత్రుడు, చిత్రత్రుడు, చిత్రవర్మభ్రుత్, అపరాజితుడు, పండితుడు, శాలాక్షుడు, దురావజితుడు, జయంతుడు, జయత్సేనుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, సుహాస్తుడు, వాతవేగుడు, సువర్చనుడు, ఆదిత్యుడు, కేతువు, బహ్వంశి, నాగదంతుడు, ఉగ్రశాయి, కవచి, నశింగి, దాసి దండధారుడు దనుర్గ్రహుడు, ఉగ్రుడు, భీముడు, రథభీముడు, భీమబాహుడు, ఆలోపుడు, భీమకర్ముడు, సుబాహుడు, భీమవిక్రాంతుడు, అభయుడు, రౌద్రకర్ముడు, దృఢరధుడు, అనానృదృడు, కుండభేది, విరావి, దీర్ధలోచనుడు, దీర్ఘధ్వజుడు. దీర్ఘ భుజుడు, అదిర్ఘుడు, దీర్ఘుడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, ప్యూడోరుడు, కనకధ్వజుడు, మహాకుండుడు, కుండుడు, కుండజుడు, చిత్రజాసనుడు, చిత్రకుడు, కవి, వీరి సోదరి దుస్సల.

తారకాసురుడు

వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడు తారకాసురుడు. బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసిన తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు విజ్రుంభించి అన్ని లోకాల వారినీ బాధించడం మొదలుపెట్టాడు. చివరికి శివుని కుమారుడే తారకాసురుడిని వధించగలడని బ్రహ్మ చెబుతాడు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో అతడిని సంహరిస్తాడు. 

జనమేజయుడు

వైశంపాయనుడు, భారత కథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. సర్పయాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అలా సర్పజాతిని నిర్మూలించాలనుకుంటాడు జనమేజయుడు. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు. 

అనిరుద్ధుడు

కృష్ణునికి అనిరుద్ధుడు మనుమడు. ప్రద్యుమ్నుని కుమారుడితడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుల కథలు ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. అనిరుద్ధుడు మొదట రుక్మి మనుమరాలైన రుక్మిలోచనను వివాహమాడతాడు. బాణాసురుని కుమార్తె అయిన ఉష అనిరుద్ధుని రూపాన్ని కలలో చూసి, అతడిని వరిస్తుంది. ఉష చెలికత్తె అనిరుద్ధుడిని మాయా విద్యతో ఉష వద్దకు చేరుస్తుంది. వారికి వజ్రుడనే కుమారుడు జన్మిస్తాడు. అంతఃపురంలోకి ఇతరులు ప్రవేశించాలని తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. అనిరుద్ధుడి విషయం తెలుసుకున్న ప్రద్యుమ్నుడు, సాత్యకి కృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేసి, అతనిని ఓడించి అనిరుద్ధుడికీ ఉషకు వివాహం చేస్తారు.

పరీక్షిత్తు వృత్తాంతం

పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.
గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.
ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.
తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.
చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.
ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

ఉపపాండవులు(పాండవుల సంతానం )

పాండవుల కుమారులను ఉపపాండవులని పిలుస్తారు. ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు, వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులకు జన్మించారు. పూర్వజన్మలో వీరు విశ్వులనే దేవతలు. ఉపపాండవులుగా వీరు జన్మించడం వెనుక హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని నగరము విడిచి వెళ్ళమని విశ్వామిత్రుడు అనడం చూసి, ఋషులకు ఇంత కోపము పనికిరాదని విశ్వువులు అనుకుంటారు. ఇది విన్న విశ్వామిత్రుడికి కోపము వచ్చి, నరులుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపం వల్ల వారు ఉపపాండవులుగా జన్మిస్తారు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ వీరిని రాత్రిపూట రహస్యంగా సంహరిస్తాడు.

వాలిసుగ్రీవుల జననం

రామాయణంలో కనిపించే వాలిసుగ్రీవుల తండ్రి ఋక్షవిరజుడు. బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన కళ్ళ నుండి రాలిన అశ్రువుల నుంచి జన్మించిన వాడు ఋక్షవిరజుడు. అరణ్యంలో తిరుగుతుండగా కనిపించిన ఒక చెరువులో దిగిన ఋక్షవిరజుడు, ఆ చెరువు నుంచి బయటకు వచ్చేసరికి స్త్రీగా మారిపోతాడు. గతంలో పార్వతి ఆ చెరువులో స్నానం చేయడం వల్ల అలా జరిగిందని బ్రహ్మ అతనికి చెబుతాడు. స్త్రీగా మారిన ఋక్షవిరజుడికి ఇంద్రుని వల్ల వాలిసుగ్రీవులు జన్మిస్తారు. ఆ తర్వాత వానరజాతి విస్తరిస్తుంది. 

Friday 12 October 2012

కుమారధార మహత్యం..

"పూర్వజన్మలో దానం చేయనివాడు దరిద్రుడౌతాడు.దరిద్రం తట్టుకోలేక పాపాలు చేయడం మొదలుపెడతాడు. 
పాపం వల్ల నరకానికి పోతాడు. మళ్ళీ భూలోకంలో పుట్టి దరిద్రుడౌతాడు. మళ్లీ పాపాలు చేస్తాడు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. పోనీ దానాలు చేసి పాపాల్ని తొలగించుకోవాలనుకుంటే, ఎంత శ్రమించినా, చివరకు యాచనకు వెళ్ళినా చిల్లిగవ్వ కూడా సంపాదించలేకపోతాడు. ఇహపర సుఖాలకు దానాలు చేయవలసిందే. అవి చేయలేని నాడు ఇక బతికే అర్హత లేదు అని భావించిన ఓ ముసలివాడు వేంకటాద్రి దగ్గర మరణిస్తే ఆత్మహత్యా దోషం అంటదని గురువులద్వారా విన్నాడు. వేంకటాద్రిని చరమ ప్రయాణానికి ఎన్నుకున్నాడు. వార్ధక్య భారంతో కుంగిపోతున్నా, శరీరం ఎంత దౌర్బల్యంతో ఉన్నా సహిస్తూ వేంకటాద్రి శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. "సకల దేవతలారా! ప్రత్యక్షదైవమైన సూర్య దేవా! భగవాన్ శశాంకా! పంచాభూతాల్లారా! దరిద్రం బాధని భరించలేకుండా ఉన్నాను. 
వార్ధక్యాన్నీ తట్టుకోలేకపోతున్నా.. చాలు ఇక నాకీ జన్మ. కనీసం వచ్చే జన్మలోనైనా సుఖపడే యోగాన్ని ప్రసాదించండి." అని వేడుకుని కొండపై నుండి దూకబోతుండగా వెనుకనుండి, వేటకు వచ్చిన ఒక రాకుమారుడు అతన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. వృద్ధుడు ఆ  రాజ కుమారుడిని చూశాడు. పరమ సుకుమార సుందరుడు, నీలమేఘచ్ఛాయా శరీరుడూ అయిన, ఆ యువకుడిని చూసి తన శరీర బాధను కొంత మరిచిరిచిపోయాడు. ఏం నాయనా! ఎందుకు రక్షించావు నన్ను" అంటూ ప్రశ్నించాడు. "వృద్ధుడా! ఆత్మహత్య కంటే మహాపాపం ఈ సృష్టిలో ఇంకేమీ లేదు. ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచమై అల్లాడిపోతాడు. కొంత కాలం పైశాచిక జన్మమెత్తాక ఘోరనరకాలకు చేరి, నానా యాతనలూ అనుభవించి చివరకు నీచ జన్మలెత్తి మరలా దారిద్ర్య బాధలు పొందుతాడు జీవుడు. నీవు దరిద్రబాధకు తట్టుకోలేక బలవంతపు మరణం పొందితే, ఇంతకంటే ఎక్కువ కష్టాలు కొనితెచ్చుకుంటావు సుమా! అందుకే నేనాపాను, అన్నాడు ఆ యువకుడు. "అయ్యా! నీవు కరుణా సముద్రుడిలా కనిపిస్తున్నావు. 
కన్నబిడ్డలా వచ్చి, నన్ను చావకుండా కాపాడావు. కానీ, నా కష్టాలు నీకు పూర్తిగా తెలియవు. తెలిస్తే నువ్వే నన్ను చావమంటావు. నాది పెద్ద సంసారం. మింగ మెతుకులేని దుఃస్థితి. రోజూ తిండికోసం వెదకి వెదకి, విసిగిపోయాను. ఈ దీన జీవితం నాకక్కర్లేదు. నన్ను బ్రతికించివాడివి, నా దారిద్ర్యం తొలగించనైనా తొలగించు లేదా నన్ను నీవే కడతేర్చి పుణ్యం కట్టుకో" అంటూ వృద్ధుడు బావురమన్నాడు. దానికా యువకుడు చిరునవ్వులు చిందిస్తూ "తాతగారూ! మీరు నాపై పెద్ద బాధ్యతనే మోపారు. మీ చావు చూడలేను గానీ, మీకు నా చేతనైనంత సహకారం చేస్తాను. నాతో రండి" అంటూ, కుమారధార దగ్గరికి తీసుకెళ్లాడు. ఇందులో స్నానం చేయండి, మీ దరిద్రంమొత్తం పటాపంచలైపోతుంది.. అని చెప్పాడు. వృద్ధుడా ధారలో మునిగాడు వెంటనే నవయౌవనం వచ్చేసింది. అతడాశ్చర్యపోయాడు. తనను అక్కడికి తీసుకొచ్చిన యువకుడికోసం ప్రక్కకి తిరిగాడు. కనబడలేదు. చూస్తుండగానే ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపు మధ్యలో నీలమేఘచ్ఛాయా శరీరుడు, మకరకుండల విభూషితుడు, నరరత్నోజ్జ్వల కిరీటధారి, లక్ష్మీసమేతుడు సర్వాంగ సుందరుడూ అయిన శ్రీమన్నారాయుణుడు దర్శనమిచ్చాడు. 

పులకించిపోయిన నవ యువకుడు, ఆనంద బాష్పాలతో, "స్వామీ! నన్ను అనుగ్రహించడానికొచ్చిన దైవానివా! గుర్తించలేని నిర్భాగ్యుడిని నన్ను క్షమించు. నిన్ను చూశాక నా కోరికలన్నీ నశించాయి" అన్నాడు. అప్పుడు శ్రీ వేంకటేశ్వరుడు "నాయనా! నీవు యువకుడిగా మారిన క్షణంలోనే, నీ భార్యకూడా యువతిగా మారింది. నీ పిల్లలు కూడా ఆరోగ్య సంపన్నులయ్యారు. ఇది కుమారా ధార. వేంకటాచలంలోని అత్యంత పవిత్ర తీర్థం. ఇందులో స్నానం చేసిన వారికి నిత్య శుభాలు కలుగుతాయి. విశ్వాసంతో నన్ను తలచుకుని స్నానం చేసిన వారికి నవయౌవనం వస్తుంది. ఇక నీ కష్టలు గట్టెక్కాయి. సర్వసంపదలూ నీకు ప్రసాదిస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడూ ఆత్మహత్యా ప్రయత్నం చేయకు. అన్నింటికంటె ఆత్మహత్య మహాపాతకం. ఈ సత్యం లోకంలో చాటు" అని పలికి మాయమైపోయాడు.

Saturday 18 August 2012

ద్వారకా తిరుమల


ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట. అందుకనే.. ఈ ఆలయంలో మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం. ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా, రెండవది స్వామివారి పై భాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండే అర్థవిగ్రహంగా ఉంటుంది.

స్థల పురాణం ప్రకారం చూస్తే... ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవను కోరారట. దాంతో స్వామివారి పాదములను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది. అందుకే మనకు నేడు స్వామివారి పై భాగం మాత్రమే దర్శనమిస్తుంది.

అయితే.. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ... అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై.. వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని చెబుతుంటారు.
అందుకే.. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వేంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ.. ఆ తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామపురుషార్ధములు సమకూరుతాయనీ భక్తులు నమ్ముతుంటారు.

ద్వారకా తిరుమలలోని స్వామి వారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టుపడినా.. అది స్వామివారి విగ్రహం క్రిందనుండే ఎర్రచీమలను కదుల్చుతుందని అభిషేకం చేయరు. గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ, ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతుంటారు. ఎందుకంటే.. స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్టించిన కారణంగా అలా చేస్తుంటారు.

ద్వారకా తిరుమలకు చేరుకోవడం ఎలాగంటే...? విజయవాడ-రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిరోజూ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నడుపుతోంది.


ఇక వసతి విషయానికి వస్తే... పద్మావతి అతిధి గృహం, అండాళ్ అతిధి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టీటీడీ అతిధి గృహంలాంటివి ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడుకొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకుని, మొక్కులను తీర్చుకోలేని భక్తులకు ద్వారకా తిరుమల దర్శనం సంతృప్తిని.. తిరుమల వెళ్ళిన అనుభూతిని, ఫలితాన్ని కలుగజేస్తూ భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. 

శ్రావణ మాసం


శ్రావణ మాసం అని ఎందుకు పేరు ? అంటే మనయొక్క మొరలని ఆలకించేందుకు ఆ తల్లిని సిద్దపరిచే మాసం కనుకనే శ్రావణం అని పేరు. మన మొరలని ఆలకించే సమయం, శ్రవణ సంబంధమైన మాసం శ్రావణము. ఈ మాసంలో అమ్మ మనకు ఏకాంతంగా లభిస్తుంది. చాతుర్మాస్య క్రమం తెలుసుకుంటే అర్థం అవుతుంది. ఆషాడ మాస ఏకాదశి వరకు స్వామితో నిరంతరం ఉండే తల్లి పాలకడలిలో స్వామిని యోగ నిద్రలో పవళింపజేసి జగత్ రక్షణ ఎట్లా చేయాలో ఆలోచించుకోవడానికి కావల్సిన సమయాన్ని ఆయనకు ఇవ్వడానికి స్వామికి విశ్రాంతినిచ్చి అమ్మ బయలుదేరుతుంది. తరువాత వచ్చే మాసమైన శ్రావణ మాసంలో అమ్మ అందరి మొరలు వినడానికి అందుబాటులోకి వస్తుంది. అందుకే అమ్మను ఆరాధన చేస్తుంటారు. శ్రావణ మాసం అంతా అమ్మను ఆరాధన చేయడానికి వీలైన సమయం. ప్రక్కన స్వామి లేనప్పుడు మన భాదలను అమ్మతో ఒంటరిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తరువాత మాసం భాద్రపద. మనకు భద్రములను కలిగించడానికి చేసే మాసం. ఆతరువాతి మాసం ఆశ్వయుజ మాసం. అప్పుడు స్వామిని అమ్మను ఇరువురిని కలిపి పూజ చేయడానికి పూర్వ రంగం. అందుకే దసరా పండగనాడు స్వామి అశ్వవాహనం పై బయలుదేరి వస్తాడు. దానికి ముందు అమ్మ అనేక రూపాల్లో ఆరాధనల్ని అందుకొని శమీ వృక్షం క్రింద ఉంటుంది. శమీ అంటే క్షమింపజేసేది అని అర్థం. అందుకే స్వామి, మనం ఇరువురం శమీ వద్దకు వెళ్తాం. స్వామిని మనల్ని ఒకచోట కూర్చుతుంది అమ్మ. భగవంతుని రక్షణ తప్పక లభిస్తుంది అనే ఆనందంతోటే మనం ఆశ్వయుజ మాస చివరలో దీపాలను వెలిగిస్తాం. వచ్చే కార్తీక మాసంలో స్వామి లేచి వస్తాడు. ఈ క్రమాన్ని గమనించి మన పూర్వులు శ్రావణ మాసంలో అమ్మను ఆరాధన చేసే పద్దతిని ఏర్పరిచారు. అందుకే లక్ష్మీ ప్రదమైన శ్రావణ మాసంలో అమ్మను గురించి తెలుసుకోవడం మన స్వరూపం.

దక్షిణ

పూర్వము గోలోకము లో సుశీల అనే గోపిక ఉన్నది.ఆమె  శ్రీహరి కి అత్యంత ప్రియురాలు.రాధ కు స్నేహితురాలు.విద్యా గుణవతి అయిన యువతి.ఒకనాడు ఆ సుశీల రాధ చూచుచుండగా  శ్రీకృష్ణుని ఎడమ భాగమున నిలుచుండెను.అప్పుడు గోపికలందరిలో అందెవేసిన చేయి అయిన రాధ తన ఎదురుగ ఉండుట చూసి శ్రీకృష్ణుడు భయముతో తల వంచుకొనెను.రాధ ఆ దృశ్యము చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది..అది చూసి శ్రీ కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.శ్రీకృష్ణుడు అంతర్ధానం అవటం చూసి సుశీల,మిగత గోపికలు భయపడిపోయారు.వారందరూ కృష్ణున్ని ప్రార్ధించారు..సుశీల పారిపోయింది,,సుశీల పారిపోవుట,శ్రీకృష్ణుడు కనిపించక పోవుట తెలుసుకొని రాధ సుశీల ను శపించింది,,ఇక నుండి గోలోకము లో కాలు పెట్టరాదు,పెట్టిన భస్మము అవుదువు గాక అని.రాధ శ్రీ కృష్ణుని దర్శనము ఇమ్మని ప్రార్ధించింది,,కాని శ్రీకృష్ణుడు రాధ ముందు కనిపించలేదు.
చాలా సంవత్సరాలు సుశీల తపస్సు చేసి లక్ష్మి దేవి శరీరము లో ప్రవేశించినది.
తరువాత దేవతల అందరూ అనేక యజ్ఞములు చేసారు.కనీ వారు ఆ యజ్ఞముల ఫలమును అనుభవింప లేకుండిరి.అప్పుడు వారు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు.బ్రహ్మ కొంత కాలము తన మనస్సులో విష్ణు మూర్తి ని ధ్యానించి సమాధానము పొందారు.దాని ఫలితము గా నారాయణుడు మహాలక్ష్మి శరీరము నుండి ఒక దేవి పుట్టించి ఆమెను బ్రహ్మ కు సమర్పించారు.ఆ దేవి లక్ష్మి కు దక్షిణ భాగము నుండి జనించుట చే ఆమెకు దక్షిణ అనే పేరు వచ్చింది. యజ్ఞ భావనుడు దక్షిణ ను తన భార్య గా చేసుకొనెను.దక్షిణ పన్నెండు సంవత్సరాలు గర్భము ధరించి ఒక పుత్రుని కనెను అతని పేరు "ఫలము" .ఈతడు కర్మలను సక్రమముగా పూర్తి చేసిన వారికీ ఫలములను ఇచ్చును.యజ్ఞుడు,దక్షిణా పత్నితో పుత్రఫలముతో కర్మిష్టు లకు ఫలము ఒసగుచుండును.అప్పుడు దేవతలు అందరూ సంతోషించి తమ తమ నివాసములకు వెళ్లారు.
కర్త అగు వాడు తన కార్యము పూర్తి అయిన వెంటనే బ్రాహ్మణులకు దక్షిణ ఈయవలెను.అప్పటికప్పుడే కర్త కు ఫలము సిద్దిస్తుంది.దక్షిణ ఈయనిచో చేసిన పుణ్యము అంతయు బూడిద లో పోసిన పన్నీరు అగును.

గరుత్మంతుడు

గరుత్మంతుడు స్వామి వారి వాహనము అగు కధ

శ్రీకృష్ణ మంత్రం


శ్రీకృష్ణ భగవానుని మూల మంత్రం :
" కృం కృష్ణాయ నమః "

ఇది శ్రీకృష్ణుని మూల మంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖ-శాంతులతో గడపాలనుకుంటున్నారో అలాంటివారు ప్రాతఃకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే మనిషి అన్ని రకాల బాధలు, కష్ణాలనుంచి విముక్తుడౌతాడని పురాణాలు చెపుతున్నాయి. 

చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్ 2

అని ధ్యానించి మంగళవారం, శుక్రవారం పూట ముత్తైదువులు, కన్యలు ఇంటి ముంగిట దీపం వెలిగించినట్లైతే ఆ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు.

సంపంగి


ఎంతో సువాసన ఇచ్చే సంపంగి పుష్పమును దేవుని పూజ లో ఉపయోగించము,,కారణము ఏమిటో తెలుసుకొందాము,,
ఒకానొక కాలంలో ఒక దురాత్ముడు ఉండేవాడు. అయినను అతడు నిత్య శివపూజాసక్తుడు. ప్రతిదినం సంపెంగలచేత శివుని పూజించి ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రుడైనవాడు.
ఆ దేశపు చక్రవర్తినే శాసించగల స్థితికి చేరుకున్నవాడు. చక్రవర్తి అంతటి వాడిని, పాదాక్రాంతుడిగా చేసుకున్న గర్వంతో అతడు ప్రజలను పీడించసాగాడు. కానీ, అతడిపై ఫిర్యాదు చేసినా రాజు పట్టించు కొనేవాడుకాదు.
ఇలా ఉండగా - అతడు ప్రతిరోజు తన అర్చన (సంపెంగపూలతో) మానివేయకుండా జాగ్రత్త పడుతూవచ్చాడు. ఆ కారణాన అంతులేని శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు.
నారదుడు ఓసారి భూలోక సంచారార్థం వచ్చినప్పుడు ఈ వైనం అంతా చూశాడు. కానీ ఆయనకు మొదట్లో ఈ దుష్ఠుని అంతర్యం అంతుపట్టలేదు.
అతడెటువంటివాడని అడగ్గా, సంపంగి బదులివ్వలేదు. కేవలం ఆ దుష్టబుద్ధి అకృత్యాలకు భయపడి సంపంగి మారుపల్కలేదు.
అయినా దేవర్షి అంతటివాడు అడిగినప్పుడు సత్యం చెప్పాలి కదా! దుష్టుని బెదిరింపు వల్ల చెప్పలేకపోవచ్చు! అసత్యమేల? నారదుడు తరచి తరచి ప్రశ్నించినా తనకేమీ తెలియదంది సంపంగి.
అసత్యదోషానికి పాల్పడినందువల్ల "నేటినుంచీ నీ పూలు శివపూజార్హత కోల్పోవుగాక!" అని శపించాడు నారదుడు.
అంతవరకు శివప్రీతికరమైన సంపెంగకు శివపాద సన్నిధి చేరే అవకాశం నశించింది.
                                                                                    (శ్రీ శివ మహాపురాణము నుండి సేకరించిన కధ )  
 

Sunday 12 August 2012

శ్రీ కృష్ణ లీలలు -1


ఒకసారి చిన్నారి కృష్ణుడు రత్నాలు పొదిగిన నేలపై మోకాళ్ళతో దోగాడుతుండగా, కమలంవలె మెరుస్తోన్న కన్యయ్య ముఖం ఆ నేలపై ప్రతి ఫలించసాగింది. ఆ బింబం తను ఏది చేస్తే, అది చేస్తోంది. తను నవ్వితే ఆ ప్రతిబింబం కూడా నవ్వుతోంది. తాను దోగాడుతుంటే అది కూడా దోగాడుతోంది.

తనకొక మిత్రుడు దొరికాడనుకున్న కృష్ణుడు మురిసిపోతూ, ఆ ప్రతిబింబంతో, ‘సోదరా! నువ్వెక్కడుంటావు. ఈరోజు నుంచి మనం మిత్రులం. నేను వెన్న, పాలు తాగుతాను కదా! అవి నీకు కూడ ఇస్తాను. మా అన్న బలరాముడు నాతో ఎప్పుడూ తగవులు పడుతుంటాడు. నువ్వు కూడా అలా ఏమి చేయవుకదా! మా ఇంట్లో అన్నీ వస్తువులున్నాయి. నీకేం కావాల న్నా మా అమ్మనడిగి ఇప్పిస్తాను. పాలు, వెన్న, కలకండ... ఏమి కావాలన్నా నన్ను అడుగు’ అని ఆ ప్రతిబింబాన్ని పట్టుకునేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు. తను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ ప్రతిబింబం మాత్రం తనకు చిక్కడం లేదు. ఎంతగా ప్రయ త్నించినా, అంతగా దూరంగా జరుగుతుందే తప్ప ఆ ప్రతి బింబం కృష్ణయ్య చేతులకు చిక్కడం లేదు.

ఇక, ఏమి చేయలేకపోయిన కన్నయ్య ఏడుపు ముఖం పెట్టాడు. ఆ చిట్టి కృష్ణయ్య కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయాయి. ఉబి కొస్తున్న ఏడుపువెక్కిళ్ళతో బయటపడుతోంది. అంతలో అటుగా వచ్చిన యశోదాదేవి తన గారాలపట్టి కళ్ళల్లో నీళ్ళు చూసి, నొచ్చుకుని, ‘అడెడెడె... ఏమైంది కన్నా! ఎందుకేడుస్తున్నావు?’ అని బుజ్జగించింది. అమ్మను చూడగానే కృష్ణుడు మాట మార్చా డు. ఎలాగైనా అమ్మ దగ్గర్నుంచి వెన్నముద్ద తీసుకుని తినాలన్నది కన్నయ్య ఆలోచన. ‘అమ్మా! వీడు చూడవే, మనింట్లో వెన్నను దొంగిలించడానికి వచ్చినట్లున్నాడు. నేను ఆపినా ఆగడం లేదు. నేను తిడితేవాడు నన్ను తిడుతున్నాడు. నేను కొడవామంటే నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఇట్రామ్మా. ఇద్దరం వీడిని బయటకు తరుముదాం.

లేకపోతే వీడు మన వెన్నంతా తినేస్తాడు’ అని కృష్ణుడు ఏడుస్తూ చెప్పడంతో మురిసిపోయిన యశోద, తన కన్నయ్యను లాలిస్తూ వెన్నముద్దలతో కృష్ణుడి నోటిని నింపేసింది.

మంత్రము

                                            ఓం సుఖప్రదాయై నమః

ఈ మంత్రాన్ని 40రోజుల పాటు భక్తితో రోజూ 1000సార్లు జపిస్తూ మారేడాకులతో అమ్మను పూజిస్తే సుఖాలు లభిస్తాయి,
వార్థక్యంలో వచ్చే దుఃఖాలు పోవడానికి రోజూ 108సార్లు ఈ నామాన్ని కేవలం జపిస్తే చాలు
ఇక మోక్షం కావాలనుకొన్నవారు రాత్రిపూట ఈ మంత్రాన్ని ఏ కోరికా లేకుండా యథాశక్తి జపించుకోవాలి.
స్వగృహ ప్రాప్తికి 90రోజులు తులసి, మారేడు పత్రాలతో అమ్మను పూజిస్తూ, పాయసం నివేదిస్తే రెండేళ్లలోపు సొంత ఇల్లు లభిస్తుంది. 

Saturday 11 August 2012

మడి

మడి ఎలా కట్టుకోవాలి? : రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ( 11 లోపు ) ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరవేసినది ఉత్తమం.  ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండేముల మీద ఇంటిలో గానీ లేక  ఆరు బయట గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల  అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడు తూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )  మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడి గుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట / పూజ చేయ వలెను. మడితో నే  సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు.  ( ఇది ఉత్తమమైన మడి ) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.
మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు.  ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలు గుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరిని చో (స్వచ్ఛమైన ) పట్టు వస్త్రము.   
 
మగ వాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని  గానీ, ఆడ వాళ్ళు చీరను లుంగి లాగ లో పావడా తో  గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసిమాత్రమే పంచ / చీర కట్ట వలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించిం, ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు. మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి.

భోజనము

 

భోజనము చేయునపుడు ఆచరించవలసినవి


ముందుగా కాళ్లూ,చేతులు, నోరు శుభ్రపరచుకొని బోజనమునకు కూర్చొన వలెను. భగవంతుని స్మరించ వలెను.

శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .

శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.

శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.

ఓం నమో నారాయణాయ.

ఔపోశనము
( భోజనమునకు ముందు )

ఓ భూర్భువస్సువః. తత్సవితుర్వరేణ్యం. భర్గోదేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్.


అని గాయత్రీ మంత్రమును చదువుతూ నీటిని అన్న పదార్థములపై చల్లాలి. తద్వారా ఆ పదార్థమును ఆవహించి యున్న భూతములు తొలగి పోతాయి.
తరువాత ఎడమచేతి మధ్యవేలును విస్తరాకు పై ఆనించ వలెను.

సత్యంత్వర్తేన పరిషించామి ( సూర్యాస్తమయము తరువాత అయితే - ఋత్వంత్వా సత్యేన పరిషించామి ) అని చెప్పి నీటిని అన్నము చుట్టూ సవ్యముగా పొయ్యాలి. తరువాత భోజన పాత్రకు దక్షిణముగా నిరు చల్లి కొద్దికొద్దిగా అన్నము తీసుకోని

ధర్మ రాజాయ నమః
చిత్రగుప్తాయ నమః
ప్రేతెభ్యో నమః

అనుచు బలులను తూర్పు అంతముగా సమర్పించవలెను.
అరచేతిలో నీటిని తీసుకోని
అమృతమస్తు. అని అన్నమును అభిమంత్రించ వలెను.
అమృతోపస్తరణమసి స్వాహా అని నీటిని తాగాలి.

కుడిచేతి బొటన వేలు మధ్య, ఉంగరం వేళ్లతో అన్నమును కొద్ది కొద్దిగా తీసుకుని క్రింది మంత్రమును చెప్తూ పంటికి తగుల కుండ మ్రింగ వలెను.

ఓం ప్రాణాయ స్వాహా.
ఓం అపానాయ స్వాహా.
ఓం వ్యానాయ స్వాహా.
ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా.
ఓం బ్రహ్మణే స్వాహా.

మనకు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములని పంచప్రాణములు కలవు. ఆ పంచ ప్రాణాత్మకమైన అగ్నికి ఆహుతులను సమర్పించుట ఇందు ఉన్న అంతరార్థము. పంటికి తగిలితే అది ఎంగిలి అవుతుంది.

తరువాత ఎడమచేతిని ప్రక్కన ఉన్న నీటితో కొద్దిగా తడిచేసుకుని శుభ్రపరచుకుని భోజనమును ముగించవలెను. 

ఉత్తర ఔపోశనము ( భోజనము తరువాత )
  నీటిని కుడి చేతిలొపోసుకుని అమృతాపిధానమసి. అని కొద్దిగా తాగి మిగిలిన నీటిని క్రింది మంత్రమును చదువుతూ అపసవ్యముగా ఉచ్ఛిష్ట అన్నము ( విస్తరాకు ) చుట్టూ పొయ్యవలెను.

రౌరవే2పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకందత్తం అక్షయ్యముపతిష్ఠతు.
అనంతరము కాళ్లూ , చేతులు, నోరు శుభ్రపరచుకొని ఆచమనము చేయ వలెను.రెండు చేతులను గట్టిగా రాపిడి చేసి రెండు కళ్లను తుడుచు కొన వలెను. ఈరకముగా మూడు సార్లు చేయవలెను. తద్వారా కంటి దోషాలు తొలగి పోతాయి.
మన సంప్రదాయంలో భోజనమూ యజ్ఞమే. యాగదేవతలు పంచప్రాణాలు. యాగాగ్ని కడుపులోని జఠరాగ్ని. యాగహవిస్సులు తొలిగా తినే పలుకులు. అందువలననే శుచిగా వండినది, శుచిగా తినాలన్న నియమం.

Wednesday 8 August 2012

బిల్వవృక్షం


ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది.

మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు.

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు, ఆయన సూచన ప్రకారం, శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.

గణనాథుని విన్నపం మేరకు, తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో, దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి, ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి.

అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!!' అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి. శక్తికి సమర్పించబోగా, ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీదేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది.

అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, "తథాస్తు! నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు. మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి" అని దీవించాడు. ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది.

లక్ష్మి నౄసింహ కరావలంబ స్తోత్రం

రచన: ఆది శంకరాచార్య
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 ||
సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 ||
సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 ||
సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 ||
సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 ||
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 ||
సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 8 ||
సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 9 ||
సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 10 ||
సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 11 ||
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 12 ||
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 13 ||
ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 14 ||
అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 15 ||
ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 16 ||
లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || 17 ||

లక్ష్మీ నరసింహస్వామి


హైదరాబాద్‌కు 60 కి.మీ దూరంలో సికింద్రాబాద్- కాజీపేట్ మార్గంలో భోన్‌గిర్ సమీపంలో ఉన్న కొండప్రాంతం. యాదగిరిగుట్ట అని పిలువబడే 300 అడుగుల ఎత్తున్నఈ గుట్టపై (కొండ)పై లక్ష్మీ సమేత నరసింహస్వామి కొలువు దీరారు.

ఆ ఆలయంలో జ్వాలా నరసింహ, గండబేరుండ నరసింహ, యోగ నరసింహలను భక్తులు పూజిస్తారు. అంతేకాదు, ఈ ఆలయంలో లక్ష్మీనరసింహుని వెండి విగ్రహాలు దర్శమిస్తాయి. ఈ ఆలయ ద్వారం వద్ద హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దీనినే గండబేరుండ నరసింహ అని అంటారు. అంతేకాదు, గుట్ట(కొండ)పై ఓ శివాలయం కూడా ఉంది.

స్థలపురాణం:
పూర్వం రష్యసృంగుని కుమారుడు యాదవుడు విష్ణు మూర్తిని మూడు అవతారాలలో చూడాలని ఘోర తపస్సు చేశాడట. ఈ కోరికను మన్నించిన విష్ణుమూర్తి ఆ గుట్టపై వెలిశాడు. అప్పటినుంచి ఈ కొండకు యాదగిరికొండ అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేస్తారు కనుక, దీనికి ఋషి ఆరాధనా క్షేత్రంగా పేరు వచ్చింది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్రనరసింహుడు ప్రహ్లాదునికి దర్శనమిచ్చారనేందుకు సాక్ష్యంగా ఇక్కడ ఓ గుహ ఉంది.

దెయ్యాలు పట్టినవారు, దుష్టశక్తులచే ప్రభావితం అయినవారు, చేతబడులు జరిగినవారు ఇక్కడకు అధికంగా వస్తారు. ఈ స్వామి వారికి స్వప్నంలో కనిపించి వారి వ్యాధులను నయం చేసినట్టు చాలా సందర్భాలు చెబుతున్నాయి. రాజధానిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఇది అతి ముఖ్యమైనది. లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

కృష్ణాష్టమి పూజ


మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, "ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.

యజ్ఞోపవీత ధారణ





దేవి పూజ



శ్రీ దేవి పూజా ప్రారంభః

గణపతి ప్రార్ధన:

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

పార్వతీ పరమేశ్వర ప్రార్థన:

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.

గురు ప్రార్థన:

గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం

ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం నారాయణాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం మాధవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి, పిదప ఎంగిలి చేతిని కడగాలి )

( నమస్కారము చేస్తూ క్రింది నామాలు చదవాలి)

ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.

ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.

తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.

సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.

భూతోచ్ఛాటన: ( క్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి )

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.

ప్రాణా యామః : తరువాత ప్రాణా యామము చేయాలి. అనగా గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ). ప్రాణాయామము చాలా శక్తి వంతమైనది. మన ఆయుః ప్రమాణం మన రెప్ప పాటులను బట్టీ, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను బట్టీ, మన నోటి నుండి వచ్చే వర్ణ సంఖ్యను బట్టీ నిర్ణయించ బడుతుంది. ఇన్ని సార్లు గాలి పీల్చి వదలిన పిమ్మట, ఇన్నిసార్లు రెప్పలు మూసి తెరచిన పిమ్మట, ఇన్ని అక్షరాలు పలికిన పిమ్మట వీడి ఆయువు తీరును అని విధిచేత రాయ బడి ఉంటుంది. మన ఆయువు తీరే నాటికి మూడూ ఒకేసారి పుర్తగును. అందుకే మన ఋషులు గాలిని పీల్చి కుంభకములోనే నిలిపి అనేక సంవత్సరములు రెప్పపాటు లేకుండా, మౌనంగా తపస్సు చేసే వారు. తపస్సు చేసినంతకాలం వారి ఆయుష్షు నిలచి ఉండేది. ఇంతటి శక్తి ఉంది ప్రాణాయామానికి. మనము అటువంటి తపస్సు చేయక పోయినా రోజూ కొంత సమయం ప్రాణాయామ సాధన చేస్తే ఎటువంటి రోగములనైనా అదుపులో పెట్టుకుని రోగ్యముతో జీవించ వచ్చును.

సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే సంకల్పం పనికి వస్తుంది.)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- (చాంద్ర మానం ప్రకారం)

....................... సంవత్సరే ( ప్రభవ, విభవ మొ..గు 60 సం. లలో సంవత్సరమైతే పేరు పెట్టాలి) (ప్రస్థుతం: విరోధినామ సం..రం )
............ ఆయనే ( ఉత్తరాయణము లేదా దక్షిణాయనము ) (ప్రస్థుతం: దక్షిణాయనం )
......... ఋతౌ ( 6 ఋతువులు- ప్రస్థుతం వర్ష ఋతువు )
............. మాసే ( చైత్రాది 12 మాసాలలో ఏదైతే అది.- ప్రస్థుతం భాద్రపద మాసం )
............ పక్షే ( పక్షాలు రెండు. అవి 1. శుక్ల పక్షం, 2 కృష్ణ పక్షం- ప్రస్థుతం శుక్ల పక్షం )
............ తిథౌ ( పాడ్యమ్యాదిగా 16 తిథులు - ఈరోజు త్రయోదశీ తిథి )
........ వాసరే ( 7 వారాలకీ సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి ) (బుధవారాన్ని-సౌమ్యవారం అంటారు )
........... శుభ నక్షత్రే ( ఇక్కడ ఆరోజు నక్షత్రం పేరు చేర్చాలి.) (ఈరోజు-శ్రవణా నక్షత్రం)
......... శుభ యోగే ( విష్కంభం, ప్రీతి మొ.గు ఇవి 27 యోగాలు ) (ఈరోజు-శోభ యోగం)
.......... శుభ కరణే ( బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుఘ్నం అని ఇవి మొత్తం 11 కరణములు) (ఈరోజు-తైతుల కరణం )

( వీలైతే పూజా విధానం చివరిలో సంవత్సరాలు, నక్షత్రాలు మొ.గు మొత్తం పేర్లు రాస్తాను.)

ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-

శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-

ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )

మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా దేవీ ముద్దిశ్య- శ్రీ లలితా దేవీ ప్రీత్యర్థం- మమ శ్రీ లలితా దేవీ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూప శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజాం కరిష్యే. ( అని అక్షతలు నీళ్లు పళ్లెంలో వదిలి పెట్టాలి )

టూకీగా సంకల్పం వివరణ: కలియుగం ప్రథమ పాదంలో-భారతదేశంలో- హైదరాబాదులో- నాకు శుభమును కలిగించు గృహములో- దేముని ముందు ఉన్నటువంటి నేను- ఫలానా సంవత్సర-మాస-తిథి-వార-నక్షత్ర ములు కలిగిన శుభ దినమున- ....గోత్రంలో పుట్టిన-........ పేరుతో పిలవబడే-

ధర్మ పత్నితో కూడుకున్న వాడనైన( ఆడవారు ఇది చెప్పుకోనవసరం లేదు ) నేను-

శ్రీ లలితా దేవిని ఉద్దేశించి- శ్రీ లలితా దేవి ప్రీతి కొరకు-నాకు శ్రీ లలితా దేవి అనుగ్రహం కలగడం కొరకు- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి 16 రకాలైన సేవలతో కూడిన పూజను చేయుచున్నాను. I





సంకల్పం అయిన పిదప కలశారాధన చెయ్యాలి.
(శ్రీ లలితాపూజాం కరిష్యే. అన్న తరువాత)
తదంగ కలశారాధనం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీరు వదలాలి.

కలశారాధనం

కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ.

మనము ఆచమనము చేసిన పాత్రను కాక, భగవంతునికి ఉపయోగించడం కొరకు వేరే ఒక కలశములో నీటిని తీసుకుని కలశమును గంధము,పసుపు,కుంకుమలతో అలంకరించాలి. కలశములో త్రిమూర్తులు, మాతృగణములు, సప్తసాగరములు,సప్తద్వీపములు,చతుర్వేదములు ఆవాహన అగునట్లు భావిస్తూ క్రింది శ్లోకము చదవాలి. ( కలశము కేవలం భగవంతుని పూజకోసం వినియోగించడానికి మాత్రమే. మన ఆచమనముకొసం మనకో పాత్ర ఎలా ఉందో, అలాగే అమ్మవారి ఆచమనమునకు,స్నానమునకు మొదలైన వాని కొరకు నీటిని ఉపయోగించుటకు కలశం. )
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

కలశములోని నీటి యందు గంగా మొదలైన సప్త నదులు ఆవాహన అయినట్లుగా భావించి క్రింది శ్లోకములను చదవాలి.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు.
ఆయాంతు శ్రీ లలితా దేవీ పూజార్థం మమ దురితక్షయ కారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. కలశములోని నీటిని పూజా ద్రవ్యముల యందు, దేవుని యందు, తన యందు చల్లవలెను.


1.అథ ధ్యానం:

ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాం వరాంగీం
సర్వాలంకార యుక్తాం సతతమభయదాం భక్త నమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం
మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానించాలి( భావన చేయాలి ).

2.ఆవాహనం:

నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి
సాన్నిధ్యం కురుమేదేవి జగన్మాతః కృపాకరే.

శ్రీ లలితాదేవ్యైనమః ఆవాహయామి. ( అమ్మా నేను నిన్ను పూజించ తలచి మా గృహమునకు ఆహ్వానిస్తున్నాను. నీవు వచ్చి నా పూజను స్వీకరించి నన్ను అనుగ్రహించ వలసినది. అని భావన చేసి ) అక్షతలు కలశము లేదా విగ్రహముపై వేయవలెను. ( ఇక్కడ కలశము అంటే ప్రథాన కలశం. అంటే సత్యనారాయణ వ్రతంలో వలే దేముని పటము ముందు కలశము పెట్టి, దానిపై కొబ్బరికాయను ఉంచి, దానిమీద వస్త్రమును ఉంచుతారు. )

3.ఆసనం:

అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
మనశ్చిత్రం మనోహారి సింహాసన మిదం తవ.

శ్రీ లలితాదేవ్యైనమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ( అమ్మా! నీవు ఆసనమును అలంకరించ వలసినది అని భావించి అమ్మవారిని ఉంచిన ఆసనముపై ) అక్షతలు చల్లవలెను.

4.పాద్యం:

అనవద్య గుణేదేవి వరదే విశ్వమాతృకే
మనశ్శుద్ధం మయాదత్తం గంగామంబుపదోస్తవ.

శ్రీలలితాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి. ( అమ్మా! నీ పాదముల కొరకు నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని (ఆచమనం చేసిన పాత్రకాక మరొక పాత్రకు అలంకారం చేశారు కదా అందులోని ) నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదలవలెను.

5.అర్ఘ్యం:

సర్వ తీర్థమయం హృద్యం బహుపుష్ప సువాసితం
ఇదమర్ఘ్యం మయాదత్తం గృహాణ వరదాయిని.


శ్రీలలితాదేవ్యైనమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ( అమ్మా! నీ హస్తముల కొరకు నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.

6.ఆచమనీయం:
పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే
గృహాణాచమనం దేవి నిర్మల రుచి పూరకం.

శ్రీలలితాదేవ్యైనమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ( అమ్మా! నీ ఆచమనము కొరకు నీటిని స్వీకరించు అని భావించి) కలశము లోని నీటిని అమ్మ వారికి చూపించి క్రింద పళ్లెములో వదల వలెను.

మధుపర్కం:

మధ్వాజ్య దధి సంయుక్తం శర్కరా జల సంయుతం
మధుపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే.

శ్రీలలితాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి. ( అమ్మా! చల్లని మధుపర్కమును స్వీకరించు అని భావించి ) పెరుగు,బెల్లం/పంచదార కలిపి అమ్మవారికి చూపి పళ్లెములో వదలవలెను. ( దూరమునుండి వచ్చిన అతిథికి, ప్రయాణ బడలిక,వేడి తగ్గడం కోసం మజ్జిగ ఇవ్వడం వంటిది మధుపర్కం ఇవ్వడం )

7.స్నానం:

క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా స్నానము కొరకు నీటిని స్వీకరించు అని భావించి) కలశములోని నీటిని అమ్మవారిపై చిన్న పుష్పముతో చల్ల వలెను.

నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతృకే
ఇదం శుద్ధోదక స్మానం స్వీకురుష్వ దయామతే.

శ్రీలలితాదేవ్యైనమః శుద్ధోదక స్నానం సమర్పయామి.

పంచామౄత స్నానం:

క్రింది శ్లోకము చదువుతూ ( అమ్మా! నీ స్నానము కొరకు పంచామౄతములను, కొబ్బరి నీటిని స్వీకరించు అని భావించి ) పంచామౄతములను ( ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అను అయిదు భూలోకములో అమౄత సమానమైనవి) , కొబ్బరినీటిని అమ్మవారిపై పుష్పముతో కొద్ది కొద్దిగా చల్లవలెను.

దధి క్షీర ఘృతోపేతం శర్కరా మధు సంయుతం
నారికేళ జలైర్యుక్తం స్నానమంబ మయార్పితం.

శ్రీలలితాదేవ్యైనమః పంచామౄత స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

8.వస్త్రం:

అంబరంచాపి కౌసుంభం స్వర్ణ రేఖాంచితం శుభం
వస్త్రమేతన్మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః వస్త్ర యుగ్మం సమర్పయామి.( అమ్మా! నీ అలంకరణ కోసం వస్త్రమును స్వీకరించు అని భావించి ) వస్త్రమును గానీ, ప్రత్తితో చేసిన వస్త్రమును గానీ సమర్పించాలి.

వస్త్ర యుగ్మానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

9.యఙ్ఞోపవీతం:

నమస్తుభ్యం జగద్ధాత్రి చంద్ర కోటి మనోహరే
ఉపవీతమిదందేవి గృహాణత్వం ప్రసీదమే.

శ్రీలలితాదేవ్యైనమః యఙ్ఞోపవీతం సమర్పయామి ( అమ్మా యఙ్ఞోపవీతమును స్వీకరించు అని భావించి ) యఙ్ఞోపవీతమును గానీ ప్రత్తితో చేసిన యఙ్ఞోపవీతమును గానీ సమర్పించాలి.

యఙ్ఞోపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

ఆభరణం:
నానా విధాని రత్నాని మాంగళ్యాభరణానిచ
సౌవర్ణాని దీయంతే గృహాణ పరదేవతే

శ్రీ లలితాదేవ్యైనమః ఆభరణాని సమర్పయామి. ఆభరణాలు ( గాజులు మొ..వి ) సమర్పించ వలెను.


10.గంధం:

ఇష్ట గంధ ప్రదం దేవి అష్ట గంధాధి వాసితం
అంగరాగం మహాదేవి గృహాణ సుమనోహరం.

శ్రీలలితాదేవ్యైనమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ( అమ్మా! శ్రీ చందనమును స్వీకరించు అని భావించి ) పుష్పముతో గంధమును చల్లవలెను.


హరిద్రాచూర్ణం:

హరిద్రా చూర్ణమేతద్ధి స్వర్ణ కాంతి విరాజితం
దీయతే మహాదేవి కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః హరిద్రాచూర్ణం ( పసుపు ) సమర్పయామి.


కుంకుమాచూర్ణం:

కైలాస వాసినీ దేవి కస్తూరి తిలకాధరే
కౌళినీ గిరిజాదేవి కుంకుమాన్ మాతృకర్పయే.

శ్రీలలితాదేవ్యైనమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి. కుంకుమ మొదలగు సుగంధ ద్రవ్యములు సమర్పించ వలెను.

అక్షతాన్:

ఉద్యద్భాను సహస్రాభే జగన్మాతః కృపాకరే
స్వర్ణాక్షతామయాదత్తాః కృపయా పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః సువర్ణాక్షతాన్ సమర్పయామి. ( అక్షతలు అంటే క్షతము కానివి. అంటే విరగనివి. )


పుష్పం:

నానా విధైశ్చ కుసుమైః బహు వర్ణైస్సుగంధిభిః
పూజయామ్యహమంబత్వాం ప్రసీద పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః పుష్పాణి సమర్పయామి. ( పుష్పములు సమర్పించవలెను)

అక్షతైః పుష్పైః పూజయామి. ( అక్షతలతోను, పుష్పములతోను పూజించ వలెను. )

ఇక్కడ 108 లేదా 1008 నామములతో అమ్మవారిని పూజించ వచ్చు. ఆపిదప


11.ధూపం:

జగదంబే నమస్తేస్తు కరుణాపూర పూరితే
ధూపమేతన్మయాదత్తం గౄహాణ వరదేంబికే.

శ్రీలలితాదేవ్యైనమః ధూపం సమర్పయామి. ( సాంబ్రాణి లేదా అగరుబత్తి చూపించాలి )


12.దీపం:

కృపాపరే మహా దేవి జగద్రక్షణ తత్పరే
చంద్ర రేఖాంక మకుటే దీపోయం పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః దీపం దర్శయామి. ( దీపమును చూపవలెను )

ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ( కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను. )

13.నైవేద్యం:

భక్తేష్టదాన వరదే భక్తపాలన తత్పరే
సర్వ దేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః నైవేద్యం సమర్పయామి. నివేదనకు పండ్లు, కొబ్బరికాయ, పరమాన్నం,పిండివంటలు,పులగము మొదలగునవి యధాశక్తిగా సమర్పించ వలెను. ( అమ్మా! నాశక్తి కొలదీ సమర్పించు నివేదనను స్వీకరించు అని, కళ్లు మూసుకుని అమ్మ ప్రీతితో స్వీకరిస్తున్నట్లుగా భావించ వలెను. )

మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళ యామి. పాదౌ ప్రక్షాళ యామి. పునరాచమనీయం సమర్పయామి. నైవేద్యము అయిన తరువాత అమ్మవారు చేతులు శుభ్రపరచుకొనుటకు, పాదములు శుభ్రపరచుకొనుటకు, దాహము తీర్చుకొనుటకు కలశంలో నీటిని 5 సార్లు అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

తాంబూలం:

తాంబూల పూరితముఖి సర్వ విద్యా స్వరూపిణి
సర్వ మంత్రాత్మికేదేవి తాంబూలం పరిగృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి. 3 తమల పాకులు, రెండు వక్కలు,పండ్లు తాంబూలముగా సమర్పించవలెను.

తాంబూల సేవనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

14.నీరాజనం:

కర్పూర కాంతి విలసన్ముఖ వర్ణ విరాజితే
నీరాజనం మయాదత్తం కృపయా పరి గృహ్యతాం.

శ్రీలలితాదేవ్యైనమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి వెలిగించి అమ్మవారికి చూపుతూ వెలుగులో అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించ వలెను.

నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీటిని అమ్మ వారికి చూపించి పళ్లెములో వదలవలెను.

15.మంత్రపుష్పం:

పుష్పము అక్షతలు పట్టుకుని లెచినుంచుని అమ్మవారిని క్రింది విధంగాస్తుతించవలెను.

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవబ్రహ్మేద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ పసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం.

సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.


శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

చేతిలోని అక్షతలు, పూలు అమ్మ వారిపై వేయవలెను

ప్రదక్షిణ నమస్కారాః :

మరల పుష్పము, అక్షతలు పట్టుకుని క్రిది విధంగా చదువుతూ ఆత్మప్రదక్షిణము చేయవలెను

యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపాసంభవః
త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే
అన్యధా శరణం నాస్తి త్వమేవశరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి.

శ్రీలలితాదేవ్యైనమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

ఉరసా శిరసా దౄష్ట్యా మనసా వచసా తధా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే.

శ్రీలలితాదేవ్యైనమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి.

( అని చెప్పి బోర్లా పడుకుని చేతులు చాపి సాష్టాంగ నమస్కారం చేయవలెను. అమ్మవారిని మనసులో స్మరిస్తూ, తల్లి పాదములను మీచేతులు తాకినట్టుగా, అమ్మ మిమ్ములను ప్రేమతో ఆశీర్వదించినట్టుగా భావన చేయవలయును. పొట్ట, శిరసు, కనులు, మనసు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు అను ఎనిమిదింటి చేత నమస్కారము చేయుట సాష్టాంగ నమస్కారం. స్త్రీలు మోకాళ్లపై మాత్రమె చేయవలెను. )

అపరాధ నమస్కారం:

( అమ్మా! మానవులమై పుట్టిన మేము కలి ప్రభావంచేత తెలిసో,తెలియకో అనేక అపరాధములు చేస్తూ ఉంటాము. అలా తెలిసీ తెలియక చేసిన అపరాధములను పుత్ర/పుత్రీ వాత్సల్యముతో క్షమించి సదామమ్ము కాపాడు దేవీ..! అనే భావనతో క్రింది శ్లోకములను చదవవలెను )

అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా
దాసోయమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి.


శ్రీలలితాదేవ్యైనమః అపరాధ నమస్కారం సమర్పయామి.

యస్యస్మౄత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం మహేశ్వరీ
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే.

అనయధ్యాన ఆవాహానాది షోడశోపచారపూజయా
భగవతీ సర్వాత్మకః శ్రీ లలితా దేవీ స్సుప్రీతాస్సుప్రసన్నో వరదో భవతు.


16.ఉద్వాసనం:

శ్రీలలితాదేవ్యైనమః ఉద్వాసయామి.
ఆవాహనం నజానామి నజానామి విసర్జనం
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి

( ఉద్వాసన అంటే అమ్మవారిని సాగనంపడం. ఇక్కడ విచిత్రం చూడండి. "అమ్మా! నిన్ను ఆవాహనం చేయడమూ నాకు తెలియదు, ఉద్వాసన చేయడమూ నాకు తెలియదు, అసలు నిన్ను పూజించడమే నాకు తెలియదు ఏమైనా అపరాధములుంటే క్షమించు తల్లీ." అని పైశ్లోకంలో ప్రార్థిస్తున్నాము. అంటే మన ఇంటికి వచ్చిన మనకు అత్యంత ప్రీతి పాత్రమైన వ్యక్తి ఇంటి నుండి వెళుతుంటే ఏవిధంగా మాట్లాడతామో అలాగే ఉంది కదా!? ఎంత వినయం,విధేయతా ఉంటే మాటలు అనగలుగుతాము? అందుకే పూజ చేయడం సరిగా వస్తే సాటి మనిషితో ఎలా మెలగాలి? ఎలా ప్రేమించాలి? అనే విషయం మనకు బాగా తెలిసినట్టే అని నేను భావిస్తాను. )

శ్రీలలితాదేవ్యైనమః యధాస్థానం ప్రవేశయామి. అని అమ్మవారిపై అక్షతలు వేసి కొంత సేపు మౌనంగా ప్రార్థించాలి. తరువాత ( పళ్లెములో వదిలిన ) తీర్థమును, నివేదన చేసిన ప్రసాదమును ప్రీతితో స్వీకరించాలి.