Sunday 12 August 2012

శ్రీ కృష్ణ లీలలు -1


ఒకసారి చిన్నారి కృష్ణుడు రత్నాలు పొదిగిన నేలపై మోకాళ్ళతో దోగాడుతుండగా, కమలంవలె మెరుస్తోన్న కన్యయ్య ముఖం ఆ నేలపై ప్రతి ఫలించసాగింది. ఆ బింబం తను ఏది చేస్తే, అది చేస్తోంది. తను నవ్వితే ఆ ప్రతిబింబం కూడా నవ్వుతోంది. తాను దోగాడుతుంటే అది కూడా దోగాడుతోంది.

తనకొక మిత్రుడు దొరికాడనుకున్న కృష్ణుడు మురిసిపోతూ, ఆ ప్రతిబింబంతో, ‘సోదరా! నువ్వెక్కడుంటావు. ఈరోజు నుంచి మనం మిత్రులం. నేను వెన్న, పాలు తాగుతాను కదా! అవి నీకు కూడ ఇస్తాను. మా అన్న బలరాముడు నాతో ఎప్పుడూ తగవులు పడుతుంటాడు. నువ్వు కూడా అలా ఏమి చేయవుకదా! మా ఇంట్లో అన్నీ వస్తువులున్నాయి. నీకేం కావాల న్నా మా అమ్మనడిగి ఇప్పిస్తాను. పాలు, వెన్న, కలకండ... ఏమి కావాలన్నా నన్ను అడుగు’ అని ఆ ప్రతిబింబాన్ని పట్టుకునేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నించాడు. తను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ ప్రతిబింబం మాత్రం తనకు చిక్కడం లేదు. ఎంతగా ప్రయ త్నించినా, అంతగా దూరంగా జరుగుతుందే తప్ప ఆ ప్రతి బింబం కృష్ణయ్య చేతులకు చిక్కడం లేదు.

ఇక, ఏమి చేయలేకపోయిన కన్నయ్య ఏడుపు ముఖం పెట్టాడు. ఆ చిట్టి కృష్ణయ్య కళ్ళ నిండా నీళ్ళు నిండిపోయాయి. ఉబి కొస్తున్న ఏడుపువెక్కిళ్ళతో బయటపడుతోంది. అంతలో అటుగా వచ్చిన యశోదాదేవి తన గారాలపట్టి కళ్ళల్లో నీళ్ళు చూసి, నొచ్చుకుని, ‘అడెడెడె... ఏమైంది కన్నా! ఎందుకేడుస్తున్నావు?’ అని బుజ్జగించింది. అమ్మను చూడగానే కృష్ణుడు మాట మార్చా డు. ఎలాగైనా అమ్మ దగ్గర్నుంచి వెన్నముద్ద తీసుకుని తినాలన్నది కన్నయ్య ఆలోచన. ‘అమ్మా! వీడు చూడవే, మనింట్లో వెన్నను దొంగిలించడానికి వచ్చినట్లున్నాడు. నేను ఆపినా ఆగడం లేదు. నేను తిడితేవాడు నన్ను తిడుతున్నాడు. నేను కొడవామంటే నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఇట్రామ్మా. ఇద్దరం వీడిని బయటకు తరుముదాం.

లేకపోతే వీడు మన వెన్నంతా తినేస్తాడు’ అని కృష్ణుడు ఏడుస్తూ చెప్పడంతో మురిసిపోయిన యశోద, తన కన్నయ్యను లాలిస్తూ వెన్నముద్దలతో కృష్ణుడి నోటిని నింపేసింది.

No comments:

Post a Comment