Sunday 25 November 2012

విశ్వకర్మ

ప్రభాసుడనే మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు విశ్వకర్మ. దేవతల నగరాలు, ఆయుధాల, రథాలు విశ్వకర్మ తయారు చేస్తాడు. ఇతని కుమార్తె సంజ్ఞ. ఈమె సూర్యుని భార్య. సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోలేకపోవడంతో విశ్వకర్మ సూర్యుడికి సానబెట్టి, అతని వేడిని కొద్దిగా తగ్గిస్తాడు. సూర్యుడిని సానబెట్టిన పొడి నుంచి తయారు చేసిందే విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రం. శ్రీ కృష్ణుడికి ద్వారకను నిర్మించిందీ, పాండవులకు మయసభ నిర్మించిందీ విశ్వకర్మే. పురాణాలలో ఇతని పేరు ఇంకా అనేక చోట్ల కనిపిస్తుంది. ఘ్రుతాచి అనే వనితను చూసి మోహించిన విశ్వకర్మ, మానవుడిగా జన్మించి ఆమెను వివాహమాడడతడు. వారికి జన్మించిన వారే అనేక వృత్తులలో నిపుణులుగా స్థిరపడ్డారని పురాణాలు చెబుతాయి.

కౌరవుల పేర్లు

దుర్యోధనుడు, దుశ్శాసనుడు దుర్దర్షుడు, జలసంధుడు, సహుడు, సముడు, విందుడు, అనువిందుడు, దుర్భాషుడు సుబాహుడు, దుష్ట్రధర్షణుడు, ధర్మధుడు, చిత్రయోధి, దుష్కర్ణుడు, కర్ణుడు, వివింశతి, జయసంధి, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారువిత్రూడు, శతాననుడు, ధర్మర్షణుడు, దుర్ధర్షణుడు, వివిర్సుడు, కటుడు, శముడు, ఊర్ణనాధుడు, సునాధుడు, నందకుడు, ఉపనందకుడు, సేనాపతి, సుషేణుడు, కుండో, మహోదరుడు, చిత్రధ్వజుడు, చిత్రరధుడు, చిత్రభానుడు, అమిత్రజిత్, సువర్ముడు, దుర్వియోచనుడు, చిత్రసేనుడు, విక్రాంతకుడు, సుచిత్రుడు, చిత్రత్రుడు, చిత్రవర్మభ్రుత్, అపరాజితుడు, పండితుడు, శాలాక్షుడు, దురావజితుడు, జయంతుడు, జయత్సేనుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, సుహాస్తుడు, వాతవేగుడు, సువర్చనుడు, ఆదిత్యుడు, కేతువు, బహ్వంశి, నాగదంతుడు, ఉగ్రశాయి, కవచి, నశింగి, దాసి దండధారుడు దనుర్గ్రహుడు, ఉగ్రుడు, భీముడు, రథభీముడు, భీమబాహుడు, ఆలోపుడు, భీమకర్ముడు, సుబాహుడు, భీమవిక్రాంతుడు, అభయుడు, రౌద్రకర్ముడు, దృఢరధుడు, అనానృదృడు, కుండభేది, విరావి, దీర్ధలోచనుడు, దీర్ఘధ్వజుడు. దీర్ఘ భుజుడు, అదిర్ఘుడు, దీర్ఘుడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, ప్యూడోరుడు, కనకధ్వజుడు, మహాకుండుడు, కుండుడు, కుండజుడు, చిత్రజాసనుడు, చిత్రకుడు, కవి, వీరి సోదరి దుస్సల.

తారకాసురుడు

వజ్రాంగుడనే రాక్షసుని కుమారుడు తారకాసురుడు. బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసిన తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడు విజ్రుంభించి అన్ని లోకాల వారినీ బాధించడం మొదలుపెట్టాడు. చివరికి శివుని కుమారుడే తారకాసురుడిని వధించగలడని బ్రహ్మ చెబుతాడు. శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో అతడిని సంహరిస్తాడు. 

జనమేజయుడు

వైశంపాయనుడు, భారత కథను జనమేజయునికి వినిపించాడు. అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి పాముకాటు వల్ల మరణించాడన్న సంగతి తెలుసుకున్న జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. సర్పయాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అలా సర్పజాతిని నిర్మూలించాలనుకుంటాడు జనమేజయుడు. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరతారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయిస్తాడు. 

అనిరుద్ధుడు

కృష్ణునికి అనిరుద్ధుడు మనుమడు. ప్రద్యుమ్నుని కుమారుడితడు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుల కథలు ఇంచుమించు ఒకేవిధంగా ఉంటాయి. అనిరుద్ధుడు మొదట రుక్మి మనుమరాలైన రుక్మిలోచనను వివాహమాడతాడు. బాణాసురుని కుమార్తె అయిన ఉష అనిరుద్ధుని రూపాన్ని కలలో చూసి, అతడిని వరిస్తుంది. ఉష చెలికత్తె అనిరుద్ధుడిని మాయా విద్యతో ఉష వద్దకు చేరుస్తుంది. వారికి వజ్రుడనే కుమారుడు జన్మిస్తాడు. అంతఃపురంలోకి ఇతరులు ప్రవేశించాలని తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుడిని బంధిస్తాడు. అనిరుద్ధుడి విషయం తెలుసుకున్న ప్రద్యుమ్నుడు, సాత్యకి కృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేసి, అతనిని ఓడించి అనిరుద్ధుడికీ ఉషకు వివాహం చేస్తారు.

పరీక్షిత్తు వృత్తాంతం

పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్ధామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించినప్పుడు, ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తును బాధించింది.
గర్భస్థ శిశువు వల్ల కలిగిన బాధకు తాళలేక ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించినప్పుడు, అతడు పరీక్షిత్తును కాపాడాడు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.
ఉత్తరుని కుమార్తె ఐరావతిని పరీక్షిత్తు వివాహమాడాడు. ఒకసారి ఇతడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ ఒక ముని ఆశ్రమానికి చేరతాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తను వెన్నాడి వచ్చిన మృగమేదని అడుగుతాడు.
తపస్సులో ఉన్న ఆ ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, అక్కడ చచ్చి పడి ఉన్న పాము కళేబరాన్ని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు. అని శపిస్తాడు.
చివరకు తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెబుతాడు. పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందని తెలుసుకున్న పరీక్షిత్తు, ఒక దుర్భేద్యమైన గృహంలో ఉండిపోతాడు.
ఏడవరోజు పాములు మానవరూపంలో వచ్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇస్తారు. అందులోని ఒక పండులో ఉన్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి పరీక్షిత్తును కాటు వేయడంతో అతను మరణిస్తాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు.

ఉపపాండవులు(పాండవుల సంతానం )

పాండవుల కుమారులను ఉపపాండవులని పిలుస్తారు. ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు, వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులకు జన్మించారు. పూర్వజన్మలో వీరు విశ్వులనే దేవతలు. ఉపపాండవులుగా వీరు జన్మించడం వెనుక హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని నగరము విడిచి వెళ్ళమని విశ్వామిత్రుడు అనడం చూసి, ఋషులకు ఇంత కోపము పనికిరాదని విశ్వువులు అనుకుంటారు. ఇది విన్న విశ్వామిత్రుడికి కోపము వచ్చి, నరులుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపం వల్ల వారు ఉపపాండవులుగా జన్మిస్తారు. మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ వీరిని రాత్రిపూట రహస్యంగా సంహరిస్తాడు.

వాలిసుగ్రీవుల జననం

రామాయణంలో కనిపించే వాలిసుగ్రీవుల తండ్రి ఋక్షవిరజుడు. బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన కళ్ళ నుండి రాలిన అశ్రువుల నుంచి జన్మించిన వాడు ఋక్షవిరజుడు. అరణ్యంలో తిరుగుతుండగా కనిపించిన ఒక చెరువులో దిగిన ఋక్షవిరజుడు, ఆ చెరువు నుంచి బయటకు వచ్చేసరికి స్త్రీగా మారిపోతాడు. గతంలో పార్వతి ఆ చెరువులో స్నానం చేయడం వల్ల అలా జరిగిందని బ్రహ్మ అతనికి చెబుతాడు. స్త్రీగా మారిన ఋక్షవిరజుడికి ఇంద్రుని వల్ల వాలిసుగ్రీవులు జన్మిస్తారు. ఆ తర్వాత వానరజాతి విస్తరిస్తుంది.